తిరుమలలో అసలేం జరుగుతోంది? సంచలన నిర్ణయానికి కారణం అదేనా?

0
1531

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా సంప్రోక్షణలో భాగంగా ఆగస్టు నెల 11 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేయాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమల చరిత్రలో ఇలా ఆరు రోజుల పాటు ఆలయాన్ని మూసివేయడం ఇదే మొదటిసారి. గతంలో మహా సంప్రోక్షణ జరిగినప్పుడు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తుండేవారు. అయితే ఈసారి అలా కూడా అనుమతించరు. ఇలా 6 రోజుల పాటు ఆలయాన్ని మూసివేయాలన్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏం జరుగుతోంది..? పుట్టా వారు పగ్గాలు చేపట్టాక ఆగమ శాస్త్రాలు, వాటి నియమాలు హఠాత్తుగా మారిపోయాయా ? మహా సంప్రోక్షణ , కుంభాభిషేకాలు 12 ఏళ్ల కొకసారి రివాజుగా జరిగేవే కదా? వాటికంటూ అనాదిగా పాటిస్తున్న విధివిధానాలు అంటూ కొన్ని ఉన్నాయి కదా ? 1994 లో, 2006 లో ఇలాగే వారం పాటు గుడి మూసేశారా? విఐపీ బ్రేక్ దర్శనాలను కూడా అప్పుడు ఆపేశారా? 

ఏ గ్రహణాల రోజునో కొన్ని గంటలు తప్ప ఏకంగా ఆరు రోజులు పైగా భక్తులకు దర్శనం నిరాకరించడం ఈ శతాబ్దకాలంలో ఎన్నడైనా జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి తీవ్ర నిర్ణయం ఎవరి నడిగి , ఏ పెద్దలను సంప్రదించి చేశారు? అని భక్తులు అడుతున్నారు. 

ఆగస్టు 11 న అంకురార్పణ అయితే 9 నుంచే క్యూ గేట్లు ఎందుకు మూస్తున్నారు? క్యూలో మిగిలిన భక్తులకు అంకురార్పణ తర్వాత గతంలో లాగే దర్శనం చేయించకూడదా?  మునుపటి కంటే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందన్న సాకుతో మొత్తం దర్శనాలను టోకున ఎందుకు ఎత్తేశారు? పరిమిత సంఖ్యలో సాధారణ భక్తులు గాని, వీఐపీ బ్రేక్ ల వాళ్ళు గానీ చూడకూడనంతటి రహస్య కార్యకలాపాలు ఆ రోజులలో ఏమి జరపబోతున్నారు? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

అన్నట్టు ఆ ఆరు రోజులు సీసీ కెమెరాలను కూడా కట్టేస్తారంటున్నారు. కెమెరాల కళ్లు కూడా మంచివి కావని పుట్టాగారి ఆగమ శాస్త్రం చెప్పిందా? లేక .. కెమెరాలకు చిక్కితే ప్రమాదం అయిన సాహస కార్యాలేవైనా చేయబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జగమొండిగా ప్రసిద్ధి చెందిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో కీలక పిల్ వేయబోతున్నట్టు ప్రకటించిన వెనువెంటనే గుడిని వారం పాటు మూసి, ఇంకేవో “పనులు ” రహస్యంగా చేసుకోవాలని వివాదాస్పదమైన కొత్త బోర్డు హుటాహుటిన నిర్ణయించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఫలానా తేదీలలో దర్శనాలన్నీ బంద్ అని కేవలం మూడు వారాల ముందు ఆర్డర్ వేశారు. మరి ఆ తేదీలలో తిరుమల వెళ్లాలని చాలా నెలల కింద ప్లాన్ చేసుకుని, ఆన్ లైన్ లో దర్శనం, సేవల టిక్కెట్లు కొనుక్కుని, ప్రయాణానికి, బసకూ అన్ని ఏర్పాట్లు చేసుకున్న భక్తుల కుటుంబాలు ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతారు? అనేది ఆలోచన చేశారా? వారి కష్టనష్టాలకు పరిహారం ఎవరు చెల్లిస్తారు? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here