మర్యాద రామన్న దొంగ ఎవరో ఏలా కనిపెట్టాడు?! | Who is the Thief

0
998

ఒక ఊళ్లో ఓ ముసలి రైతు ఉండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. ఓసారి రైతుకు తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదన్నారు. ఓరోజు నలుగురు కొడుకుల్నీ దగ్గరకి రమ్మని పిలిచాడా రైతు. నేను ఇంకా ఎక్కువకాలం బతకను. నా జీవితాంతం చెమటోడ్చి కొంత సొమ్ము, ఓ నాలుగు వజ్రాలు సంపాదించాను. అవన్నీ ఓ పెట్టెలో దాచి పెట్టాను. అవసరమైనప్పుడు మీ అమ్మను అడిగి నలుగురూ సమానంగా పంచుకోండి’ అని చెప్పి చనిపోయాడు.  

కొన్నాళ్ల తరువాత నలుగురూ వేర్వేరుగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నారు. పెట్టుబడి కోసం తండ్రి సంపాదన వాటాలు వేసుకుందామని నిర్ణయించుకుని నలుగురిలో చిన్నవాణ్ణి డబ్బు పెట్టి తీసుకురమ్మని ఇంటికి పంపారు.

‘గొడవలు పడకుండా పంచుకోండి నాయనా అంటూ చిన్న కొడుకు చేతిలో డబ్బు పెట్టెను పెట్టింది వాళ్లమ్మ.  

ఇంట్లో నుంచి బయటకి వచ్చేలోపు ఆ పెట్టెలో ఉన్న వజ్రాలలో ఒకదాన్ని చిన్న కొడుకు దొంగిలించాడు.

తరువాత, పెట్టె తెరిచి చూసిన మిగతా ముగ్గురు కొడుకులూ ఆశ్చర్యపోయారు. ఇంకో వజ్రం ఏమైందీ’ అని చిన్నవాడిని నిలదీస్తే ‘నాకు తెలియదని చెప్పాడు. 

ఎవరు దొంగో తేలాలంటే మనం మర్యాద రామన్న దగ్గరకి వెళ్లాలి’ అన్నాడు పెద్దకొడుకు. సరేనని నలుగురూ బయలుదేరి వెళ్లారు.

ఆ సోదరులు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు రామన్న. 

‘నా దగ్గర ఓ మంత్రకర్ర ఉంది. దీన్ని నాలుగు ముక్కలు చేసి ఒక్కో కుండలో వేస్తాను. ఈ కుండల్ని మీ నలుగురూ నెత్తినబెట్టుకుని ఊరి చివరనున్న గుడి వరకూ వెళ్లి తిరిగి రావాలి. – ఇక్కడికి వచ్చేసరికి ఎవరి కుండలో కర్ర రెండింతలు పొడవు పెరుగుతుందో వాళ్లే అసలు దొంగ’ అని – చెప్పి వాళ్లని పంపాడు.  నలుగురూ బయలుదేరారు. ఊరి చివరికి వచ్చేసరికి దొంగతనం చేసిన చిన్న కొడుకుకి ఓ ఆలోచన వచ్చింది.  ‘దొంగతనం చేసింది నేనే కదా! అంటే నా కుండలో కర్రే పెద్దదైపోతుంది. కాబట్టి దీన్ని సగానికి విరిచేస్తే సరిపోతుంది’ అనుకుని విరిచేశాడు.

తిరిగి నలుగురూ మర్యాద రామన్న దగ్గరకి చేరుకున్నారు. కుండల్లో ఉన్న కర్రలు తీసి చూసేసరికి చిన్నవాడిది సగం చిన్నగా కనిపించింది. వజ్రం దొంగ ఎవరో అందరికీ అర్థమైంది.

‘నిజానికి ఈ కర్రలో ఎలాంటి మాయామంత్రం లేదు. అసలు దొంగను పట్టుకోవడానికి పథకం పన్ని అలా చెప్పాను’ అని వివరించాడు మర్యాద రామన్న.

చిలుక మనసు – నీతి కథలు

కోతి చెప్పిన నీతి