అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?

0
2152

Who is Ucchista Ganapati in Telugu?

ఉచ్చిష్టగణపతి ఉపాసన వామాచారంలో కూడా ఉంది. ప్రతి దేవతోపాసనకీ రెండువైపులుంటాయి.

సాత్త్విక, తామసికాలలో సాత్త్వికం మనకు క్షేమకరం. తామసం వామాచారం. అది అనుసరణీయం కాదు. అలాగే ’ఉచ్చిష్ట గణ’ శబ్దం బట్టి అశౌచ సమూహాలలోని శక్తుల్ని వశం చేసుకొనే తామసతంత్ర ప్రయోగాలు ఉండవచ్చు. కానీ వాటిని గ్రహించవలసిన పనిలేదు. ఇక సాత్త్వికంగా, తాత్త్వికంగా ఆలోచిస్తే – గణపతి వాక్స్వరూపునిగా, శబ్దస్వరూపునిగా, మంత్రాధిపతిగా వేదాలలో పేర్కొనబడ్డాడు.

’గణానాం త్వా గణపతిం హవామహే” అనే వైదిక మంత్రం ఈ భావననే చెబుతోంది. మంత్రములకు గణములు, కవులు – అని పేర్లు. వాటికి అధిపతిగా ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతి. మంత్రములన్నీ అక్షరాత్మకములు. అక్షరాలన్నీ నోటిద్వారా ఉచ్చరింపబడతాయి. అందుకే అక్షరాలే ఉచ్చిష్టాలు (ఎంగిలి). సర్వాక్షరములకు, మంత్రాలకు పతియైనందున పరబ్రహ్మయే ఉచ్చిష్టగణపతి సహస్రనామాలలో “జిహ్వా సింహాసనః ప్రభుః” అనే నామం ఉంది. నోరు అనే కలుగు (రంధ్రం)లో నాలుక అనే మూషికంపై తిరిగే అక్షరాకృతే ఉచ్చిష్ట గణపతి.

సాత్త్వికంగా ఇలా భావించి ఉచ్చిష్ట గణపతిని ఉపాసించే వైదికాచారంలో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈవిషయాన్నే మహోపాసకులైన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వివరిస్తూ – “జిహ్వాస్థలే నాథ విహాగమానం, త్వామా హురుచ్చిష్ట మిహచ్ఛలోక్త్యా” అన్నారు. ఇంకొక అర్థంలో – ఉత్+శిష్ట – ఉచ్చిష్ట (శిష్ట-మిగిలినది) విశ్వంలో మాయామయమైన విషయాలన్నిటినీ ’నేతి-నేతి’ (ఇదికాదు- ఇది కాదు) అనే నిషేధ వాక్యాలతో తొలగిస్తూ వెళితే, సర్వోత్కృష్టంగా మిగిలే ఆత్మతత్త్వమే ’ఉచ్చిష్టం’. అదే ఇంద్రియగణాలనునడుపుతూనే, వాటికి అతీతంగా ఉండే పరతత్త్వం. కనుక అది”ఉచ్చిష్టగణపతి’ ఇది వేదాంతార్థం. ఈ సాత్త్వ్క, వేదాంత (తాత్త్విక) అర్థాలే మనకు ప్రమాణాలు. దీనికి ఆధారంగా వేదవాక్యాలే గోచరిస్తాయి. అధర్వవేదంలో పరమాత్మపరంగా ’ఉచ్చిష్ట’ శబ్దాన్ని వాడారు. ఉచ్చిష్టే నామరూపం చోచ్ఛిష్టే లోక ఆహితః!! ఉచ్ఛిష్ట ఇంద్రశ్చాగ్నిశ్చ విశ్వమన్తః సమాహితమ్!! నవభూమిః సముద్రా ఉచ్ఛిష్టోధిశ్రితా దివః! ఆసూర్యో భాత్యుచ్ఛిష్టే అహోరాత్రేపి చ తన్మయి!! సన్నుచ్ఛిష్టే అసంశచో భౌ…. లౌక్యా ఉచ్ఛిష్ట ఆయత్తా వ్రశ్చ ద్రశ్చాపి శ్రీర్మయి!! లాంటి వైదికమంత్రాలున్నాయి. ఇలా పరిశీలిస్తే గణపతి స్వరూపాలన్నీ వైదికాలేనని స్పష్టమౌతుంది. ఇది అవతారమూర్తిగా కాక ఉపాస్యదేవతగా మంత్ర శాస్త్రాల ద్వారా గ్రహించగలం.

ఐశ్వర్య సిద్ధికి అద్భుత మార్గం | Wonderful Way For Wealth In Telugu