
పుష్కరుడంటే వరుణదేవుడని ఒకచోట, మహాపుణ్యపురుషుడని ఒకచోట, పుషరమంటే తీర్ధమని సరస్సు అని పురాణాలు రక రకాలుగా వర్ణించాయి.
పుష్కరుణ్ణి బ్రహ్మ సృష్టి చేశాడని, అతడు శివునికోసం తపస్సు చేసాడని కూడా కొన్నిపురాణాలు వివరించాయి.
పుష్కరుణ్ణి తీర్ధరాజు అనిపిలుస్తారు. ఈ లోకంలో నదులన్నీ తమలో స్నానం చేసినవారి పాపాలన్నింటిని స్వీకరించడం మూలంగా వాటిపవిత్రత క్షీణించడాన్ని గమనించిన పుష్కరుడు చాలా చింతించేవాడు.
ఒకనాడాయన పరమశివుడి కోసం తపస్సుచేసి నదుల దోషాలన్నింటినీ ప్రక్షాళనంచేసే మార్గాన్ని అర్ధించాడు.
శివుడికిగల ఎనిమిది దేహాలలో జలరూపమైన దేహాన్ని తనక నుగ్రహించమని కోరాడు. దానిప్రభావంవల్ల పుష్కరుడికి అనంత మైనశక్తి ప్రాప్తించినది.
నదులలోని పాపాలన్నింటినీ తొలగించగల ప్రభావం లభించింది. అందుకే నదులన్నీ పుష్కరుడిని ఆహ్వానించి తమలో నివశించవలసిందిగా అభ్యర్థించసాగాయి.
అటుపిమ్మట పన్నెండు పుణ్యనదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. ఈ ఏర్పాటు సురగురువైన బృహస్పతి సంచారాన్ని అనుసరించి నిర్ణయమైంది.
అంటే మేషరాశి, వృషభరాశి, మిథునరాశి ఇలా వరుసగా 12 రాశులలో ఎప్పడైతే గురుడు సంచరిస్తుంటాడో అప్పడే పుష్కరుడుకూడా ఆయానదులలో నివసించేలా ఏర్పాటయింది. కనుక ప్రతినదికి 12 ఏళ్ళకోసారి పుష్కరుడి ఆగమనం సంభవిస్తుంది. అంటే ప్రతినదికీ 12 ఏళ్ళకోసారి పుష్కరాలు వస్తాయి. ఇలా పన్నెండు పుణ్యనదులకు పన్నెండేళ్ళకోసారి పుష్కరాలొచ్చే క్రమం ఇదిగో ఈ వరుసలో ఏర్పాటయింది.
మేషే గంగా వృషేరేవా గతేయుగ్మే సరస్వతీ
యమునా కర్కటేచైవ గోదా సింహం గతేపిచ
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ చ తులాగతే
వృశ్చికేస్యాద్భీమరథీ చాపే పుష్కరవాహినీ
మృగే తుంగాఘటే సింధుః ప్రణీతా తటనీ ఝషే
తిష్టన్న బ్లాత్సురగురుః క్రమాత్సర్వే మునీశ్వరాః
నది | రాశి |
గంగా నది | మేష రాశి |
రేవా నది (నర్మద) | వృషభ రాశి |
సరస్వతీ నది | మిథున రాశి |
యమునా నది | కర్కాట రాశి |
గోదావరి | సింహ రాశి |
కృష్ణా నది | కన్యా రాశి |
కావేరీ నది | తులా రాశి |
భీమా నది | వృశ్చిక రాశి |
పుష్కరవాహిని/రాధ్యసాగ నది | ధనుర్ రాశి |
తుంగభద్ర నది | మకర రాశి |
సింధు నది | కుంభ రాశి |
ప్రాణహిత నది | మీన రాశి |
సురగురువగు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పడు గంగానది పుష్కరము, వృషభరాశియందు ప్రవేశించినపుడు నర్మదా నది పుష్కరము, మిథునరాశియందు గురుడున్నచో సరస్వతీనదికి పుష్కరము, కర్కాటకరాశి యందున్నచో యమునానదికి, సింహరాశియందున్న గోదావరినదికి, కన్యారాశియందున్న కృష్ణానదికి, తులయందున్న కావేరీనదికి, వృశ్చికరాశియందున్న భీమరథీనదికి, ధనూరాశియందున్న పుష్కరనదికి, మకరమందున్న తుంగభద్రా నదికి, కుంభమందు సింధునదికి, మీనరాశియందు ప్రణీతానదికి పుష్కరాలు ఏర్పడును.