రామ రామ రామ అన్న జీవి జన్మ ధన్యము అంటారు ఎందుకు ?

0
5296

Lord_Rama_statue_at_Venkateswara_Temple_in_Midhilapuri_VUDA_colony

రామనామము ఒక్కటే మోక్షమునకు మార్గము….
శ్రీరామ నామం తారక మంత్రం. తరతరాలుగా మనిషిని రుజుమార్గంలో నడిపిస్తున్నది. అత్యంత ప్రాచీనమైన శ్రీరామోపాసనను మన పూర్వీ కులు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసి తరించారు. రామ శబ్దం అష్టాక్షరీ, పంచాక్షరీ మంత్రాల సారం. అంటే, శివకేశవుల అభేదాన్ని సూచిస్తున్నదన్న మాట. శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం, శివుడు రామ మహిమ తెలిసిన వానిగా చెప్పబటం ఇందుకు ఉదాహరణ. అలాగే, శ్రీరామచంద్రునికి నమ్మిన బంటు అయిన ఆంజనేయుడు ఈశ్వరాంశతో పుట్టినవాడు కావడం విశేషం. రామనామ స్మరణతో మనుషుల్లో అనూహ్యమైన మార్పు వస్తుంది. రామనామ పారాయణ జరిగేచోట అన్న వస్త్రాలకు కొదవ ఉండదు. మనుషులు సుఖ శాంతులతో జీవిస్తారు. అందుకే, రామనామ సప్తాహాలను, రామ కోటి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మనసు నిండా శ్రీరామచంద్రుణ్ణి తలచుకుని మనం ఏపని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. శ్రీమదాంద్ర భాగవతాన్ని తాను రాయలేదనీ, ఆ శ్రీరామచంద్రుడే తన చేత రాయించాడని బమ్మెరపోతనా మాత్యుడు చెప్పుకున్నాడు. అలాగే త్యాగరాజు, రామదాసులు రామనామ సంకీర్తనంలో తాము తరించి మనలను తరింపజేసారు. ‘నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా?’ అని త్యాగరాజ స్వామి తన అన్నగారిని ప్రశ్నిస్తాడు. రామనామ శ్రవణం వల్ల మనలో ఉండే వికారాలన్నీ తొలగి పోతాయి. ఐహిక భోగభాగ్యాలు, సుఖాలపై నుంచి మన మనసును మరలింపజేసేదీ, జీవిత పరమార్థాన్ని బోధించేది రామనామమే. అందుకే రామ నామ సంకీర్తనకు మన పెద్దలు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారు. పరస్త్రీ వ్యామోహం, దురంహంకారం, అధికార మదం వల్ల ఎటువంటి చేటు కలుగుతుందో రావణాసురుని పాత్ర ద్వారా వాల్మీకి మనకు సవివరంగా తెలియజేశాడు. పితృవాక్య పాలన, స్వామి భక్తి, సోదరప్రేమ వంటివన్నీ ఎలా ఉండాలో, ఎలా ఉంటాయో రామాయణంలోని పాత్రల ద్వారా మనకు తెలియజేసాడు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవాలని మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అయితే,అవి విడిగా చెబితే మనిషి మనసులో నాటుకోవు. వాటిని సోదాహరణగా వివరించేందుకే, రామాయణ కథామృతాన్ని వాల్మీకి మనకు అందించాడు. రామశబ్దాన్ని పఠించినంత మాత్రానే మనలో మార్పు వస్తుంది. అందుకే, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోమన్నారు పెద్దలు. రామనామ మహిమ వల్ల ఎంతో మంది ముక్తిని పొందారు. రామనామం మనలను తరింపజేస్తుంది. మనజీవితాల్లో పెను మార్పులను తీసుకుని వస్తుంది. మన కోర్కెలను నెరవేరుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here