
పెళ్లిలో వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించే సంప్రదాయం ఉంది. అసలు ఈ అరుంధతి ఎవరు? ఎందుకు ఆమెను నూతన వధూవరులు చూడాలి? అనే విషయాలను వివరించే కథా సందర్భం ఇది.
శివపురాణం రుద్రసంహితలో దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మ మానసపుత్రిక సంధ్యాదేవి.
మన్మథుడు బ్రహ్మ తనకిచ్చిన పుష్పబాణాలు అందరి మీదా సరిగా పనిచేస్తాయో లేదోనని తెలుసుకొనేందుకు తన ఎదురుగా ఉన్న తండ్రి బ్రహ్మదేవుడి మీద, తన తోటి మానసపుత్రుల మీద, అలాగే సంధ్యాదేవి మీద పుష్పబాణాలను సంధించాడు.
వారందరి మనస్సులు కామవికారాలతో అల్లకల్లోలం అయ్యాయి.
శివుడికి ఈ విషయం తెలిసి అందరి కామవికారాలను పోగొట్టి వారి మనస్సులు మళ్లీ ధర్మమార్గం వైపు నడిచేలా చేశాడు.
ఆ తర్వాత కొన్నాళ్లకు సంధ్యాదేవి మనస్సు సంఘర్షణకు లోనైంది. తన సంకల్పం లేకపోయినా తన మనస్సు అధర్మంగా వికారానికి లోనైంది.
అధర్మాన్ని అనుసరించిన జన్మ అనవసరం అని ఆమె అనుకొని ఎవరికీ చెప్పకుండా తీవ్రమైన తపస్సు చేసి ఆ జన్మను చాలించి మరోజన్మను పొందాలని నిర్ణయించుకొని చంద్రభాగ నదీ సమీపానికి తపస్సు చేసుకోవటానికి వెళ్లింది.
ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు గ్రహించాడు. అయితే ఆమెకు తపస్సు చేసే క్రమం, నియమాలు ఏవీ తెలియవు.
అందుకని వేదవేదాంగ పారాయణుడు, జ్ఞానయోగి అయిన వసిష్ఠుడిని పిలిచి సంధ్య విషయం చెప్పాడు. మారురూపంలో వెళ్లి ఆమెకు తపోనియమాలు తెలియచెప్పి రమ్మనమని అన్నాడు.
వసిష్ఠుడు బ్రహ్మచర్య దీక్షాపరుడైన శుద్ధబ్రహ్మచారిగా రూపాన్ని ధరించి సంధ్య దగ్గరకు వెళ్లాడు. తనకేమీ తెలియనట్టు వివరాలన్నీ అడిగాడు.
ఆమె చెప్పిన మాటలనుబట్టి ఆమెకు తపస్సు నియమాలేవీ తెలియవని ఆమెకు వివరించి వాటిని తెలుసుకొని తపస్సు చేస్తేనే మేలు జరుగుతుందని కానిపక్షంలో సమయం వృథా అవుతుందే తప్ప ఫలితమేదీ కనిపించదని అన్నాడు.
అప్పుడామె తనకు తపస్సు నియమాలను చెప్పమని అడిగింది. వసిష్ఠుడు ముందుగా ఆమెకు ‘‘ఓం నమఃశంకరాయ’’ అనే మంత్రాన్ని జపించమని, దానితోపాటుగా మూడు పూటలా స్నానం, పూజ తదితర నియమాలను ఎలా ఆచరించాలో చెప్పాడు.
శివుడు ప్రసన్నుడై కోర్కెలను తీర్చుతాడని చెప్పి వసిష్ఠుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వసిష్ఠుడు చెప్పినట్లే సంధ్య నియబద్ధంగా తపస్సు చేసింది.
శివుడిని స్తుతించింది. దాంతో శివుడు సంతోషించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. తగిన వరాలను కోరుకోమన్నాడు.
సంధ్యాదేవి శివుడిని నాలుగు వరాలిమ్మని అడిగింది. అందులో మొదటిది లోకంలో ప్రాణులు పుట్టిన వెంటనే కాముకులు కాకుండా ఉండాలంది.
రెండోవరంగా తాను ముల్లోకాలలోనూ ప్రసిద్ధురాలవ్వాలని, తనకు లభించబోయే భర్త సహృదయుడై ఉండాలని మూడోవరంగా కోరుకుంది. నాలుగో వరంగా తన భర్త తప్ప తనను ఇతరులు ఎవరు మోహంతో చూసినా వారు నపుంసకులయ్యేలా వరం ఇమ్మంది.
శివుడు ఆమె కోరినట్టే నాలుగు వరాలను ఇచ్చాడు. అలా శివుడి నుంచి వరాలను పొందిన తర్వాత తనకు తపస్సు చేసే క్రమాన్ని నేర్పించిన వసిష్ఠుడిని భర్తగా పొందాలనుకుంటూ యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది.
ఆ తర్వాత ఆమె శుద్ధ శరీరం వహ్నిమండలం దాటి సూర్య మండలానికి చేరింది. సూర్యుడు ఆ శరీరాన్ని రెండుగా విభజించి మొదటిభాగాన్ని ప్రాతఃసంధ్యగానూ, రెండోభాగాన్ని సాయంసంధ్యగానూ చేశాడు.
సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో దేవప్రీతికరమైన ప్రాతః సంధ్య ఉంటుంది. సూర్యుడు అస్తమించేటప్పుడు పితృదేవతా ప్రీతికరంగా సాయం సంధ్య ఉంటుంది అని సూర్యుడు నిర్ణయించాడు.
అయితే ఆమె ప్రాణాలను శంకరుడు ఒక దివ్యశరీరంతో ప్రవేశపెట్టి మేధాతిథి అనే మహర్షి చేస్తున్న యజ్ఞం ముగిసే సందర్భంలో యజ్ఞ కుండంలో నుంచి ఒక దివ్యకన్యగా ఉద్భవించేలా చేశాడు. మేధాతిథి ఆ కన్యను తన కుమార్తెగా స్వీకరించి అరుంధతి అని పేరు పెట్టాడు.
ధర్మాన్ని ఎప్పుడూ ఏ కారణం చేత కూడా నివారించదు కనుక ఆమెకు అరుంధతి అని పేరు పెట్టినట్టు మేధాతిథి ప్రకటించాడు.
అలా కొద్దికాలం గడిచాక బ్రహ్మ మానసపుత్రుడైన వసిష్ఠుడు అరుంధతికి తగిన వరుడని భావించిన మేధాతిథి ఆ ఇద్దరికీ వివాహం చేశాడు.
ఆ దంపతులు ఆదర్శప్రాయులు కనుక ధర్మాన్ని తప్పనివారు కనుక వినువీధిలో ఎప్పటికీ నిలిచి ఉంటారని శివుడు తదితర దేవతలు ఆనాడు ఆశీర్వదించారు.
అరుంధతిగా మారిన సంధ్య సంకల్పం, ఆమె ధర్మబుద్ధి ఎంతో గొప్పవి కనుకనే ఈనాటికీ వివాహాలలో నవదంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించటం, అరుంధతిని అలా చూసినవారికి సర్వశుభాలు చేకూరుతాయన్నది నమ్మకం.