భగవద్గీత ఎందుకు చదవాలి ? | bhagavad gita

4
11495
635835699098517249
bhagavad gita

bhagavad gita 

మనం చేసే పనులు ఎన్నో విధాలుగా ఉంటాయి. అయినా మన వృత్తిని బట్టి ఏదో ఒక ముఖ్య లక్ష్యం, దానికి అనుగుణంగా దినచర్య ఉంటుంది. మన ముఖ్యమైన లక్ష్యమేమిటి, ఆ లక్ష్యాన్ని సాధిస్తూ మిగతా పనుల్లో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ఆలోచించి మన సమయాన్ని, శక్తిని వాడుతుంటాం.

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి సరిగ్గా ఇలాంటి ప్రశ్నే వస్తుంది. లౌకికమైన జీవితాన్ని గడుపుతూ కూడా కొందరు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటారు. ఈ సాధనలో ముఖ్య లక్ష్యం మోక్షం. మోక్షమంటే ఏదో ఊటీ లాంటి ప్రదేశంలో కోరుకున్న సుఖాలను అనుభవిస్తూ ఉండటం కాదు. సరైన జ్ఞానం మాత్రమే సుఖాన్నిస్తుంది, జ్ఞానమిచ్చే సుఖాన్నే మోక్షం అంటారని తెలుసుకున్నాం. అలాంటి మోక్షంపై జిజ్ఞాస ఉన్న వ్యక్తి ఎలాంటి పనులు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పడానికి ఒక సమగ్రమైన మార్గదర్శి (గైడ్‌) లాంటి పుస్తకమే భగవద్గీత. మోక్షంపై కోరికలేని మామూలు మనిషి కూడా కొంత వరకు ఉన్నతిని ఎలా పొంద గలడో చెబుతుంది.
 
 
ఇదివరకు వ్యాసాల్లో అక్కడక్కడా భగవద్గీత ప్రస్తావన వచ్చింది కానీ దాని సమగ్రరూపం గమనించలేదు. ఇది కేవలం సంన్యాసులకో, ముసలివారికో ఉద్దేశించిన పుస్తకం కాదు. లౌకికమైన లక్ష్యాన్ని గూర్చి మానసిక సంఘర్షణలో ఉన్న వ్యక్తికి లౌకిక జీవితంలోని మరొక వ్యక్తి చేసిన బోధ ఇది. ఇద్దరూ యోధులే, యుద్ధభూమిలోనే సంభాషణ. అర్జునుడి సమస్య మానవులందరికీ వర్తించేదే. అందువల్ల ఆ సమస్యను విశాలమైన దృష్టికోణంలో చూపి అసలు మనిషి అంటే ఏమిటి? సమాజంలో అతని కర్తవ్యమేమిటి, ఆ కర్తవ్యాన్ని ఏ దృష్టితో చూడాలి, తాను చేస్తున్న పని తన ఆధ్యాత్మిక సాధనకు ఇబ్బంది కలిగించకుండా ఎలా చేయాలి? అన్నది ఇందులోని బోధ. అర్జునుడు రాజు. అధర్మాన్ని ఆపడం అతని ధర్మం. అయినా తాను హింసకు పాల్పడుతున్నానని అతని దిగులు. అర్జునుడి మానసికస్థితిని ఒక దార్శనిక దృష్టికోణం నుంచి పరిశీలించడమే కృష్ణుడు చేసిన పని.
 
 
ప్రతివ్యక్తికీ ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది. ఆ పనిని ఎంతో బరువు మోస్తున్నట్లు క్షోభ పడుతూ చేయాలా, లేదా ఇది నా ధర్మం, దీన్ని సక్రమంగా చేయడం వల్ల సమాజానికి మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో స్వార్థభావన లేకుండా పని చేయాలా అన్నది ప్రశ్న. ఈ రెండవ పద్ధతిలో పనిచేయడమే గీతలో చెప్పిన కర్మయోగం. తను చేసే పని భగవంతుడి నియమాలకు, భగవంతుడి మనస్సుకు అనుగుణంగా చేయడం, లోకం మేలును ఉద్దేశించి చేయడం ఇందులో ముఖ్య విషయం. జనకుడు మొదలైన రాజుల ప్రవర్తన గూర్చి ఉదాహరణలిస్తాడు. జనకుడు బ్రహ్మజ్ఞాని అయినా రాజ్యపాలన చేశాడు. రాజ్యపాలనలో దుష్టుల్ని శిక్షించడం మొదలైన పనులు ఉంటాయి. అవన్నీ చేసినా అతనికి పాపాన్ని కలుగజేయవు అంటాడు కృష్ణుడు. రాజర్షి అనే పదాన్ని ఈ సందర్భంలో చూస్తాం. రాజ్యం చేస్తూ ఉన్నా జ్ఞాని అయిన వాడు రాజర్షి. హరిశ్చంద్రుడు, శిబి, రంతిదేవుడు మొదలైన రాజర్షి పరంపర మన సంస్కృతిలో ఉన్నట్లు అనేక పురాణాల వల్ల తెలుస్తుంది. ప్లేటో అనే గ్రీకు తత్త్వవేత్త బహుశా దీన్నే ఉద్దేశించి రిపబ్లిక్‌ అనే పుస్తకంలో ఒక ఆదర్శ రాజ్యంలో ఫిలాసఫర్‌ కింగ్‌ అయినవాడు ఉండాలి అన్నాడు.
 
 
ఈ కర్మయోగం వల్ల మనిషి తాను చేసే పనిని మరింత సులభంగా, సక్రమంగా చేయగలడు. నిష్కామంగా (స్వార్థభావన లేకుండా) చేస్తున్నపుడు మనస్సు పవిత్రమవుతుందనీ, అలాంటి మనస్సు ఆధ్యాత్మిక సాధనకు అవసరమనీ గీత చెబుతుంది.
 
కేవలం మన కర్తవ్యాన్ని చేయడం వల్ల ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించలేం. దీనికి తోడుగా చేయాల్సిన పని మనస్సును నిగ్రహించుకోవడం. దీన్నే ఆత్మసంయమనం అని గీత చెబుతుంది. పతంజలి యోగసూత్రాల్లో కనిపించే పద్ధతులే ఇక్కడా చూడగలం.
 
దేవుడంటే ఫలానా, ఇది తప్ప మరొకటి కాదు అంటూ మతాలు చెబుతూ ఉంటాయి. కానీ గీతలో ఇందుకు విరుద్ధంగా దేవుడు అనే దానిని ఒక వ్యక్తిగా కాకుండా ఒకానొక చైతన్యతత్వంగా చెప్పారు. ఆ చైతన్యంలో మనం దేవుడు, సృష్టికర్త, పోషకుడు అయిన ఏదో ఒక వ్యక్తిని భావన చేసుకోవచ్చు. అది ఎలాంటి భావన అయినా ఒకే తత్వాన్ని సూచిస్తుంది అని చెప్పడం గీత ప్రత్యేకత. దేవుడు అనే ఆలంబన (పట్టుగొమ్మ)తో వ్యక్తి మనస్సును పవిత్రం చేయడానికి తోడ్పడుతుందని చెబుతుంది. దీన్నే భక్తియోగం అన్నారు.
 
 
ఈ విధంగా కర్తవ్యాన్ని సరిగా చేయడం, మనస్సును నిగ్రహించుకోవడం, దేవుడు అనే ఆశయాన్ని తీసుకోవడం అంటూ మూడు సాధనాల్ని గీతలో చూడగలం. కానీ ఇవి మాత్రమే మోక్షాన్ని కలిగించలేవు. వీటన్నింటికి పరిమితులున్నాయి. కర్మయోగం మనస్సును పవిత్రం చేస్తుంది, యోగసాధన కొంతవరకూ వైరాగ్యాన్ని కలుగుజేస్తుంది. భక్తి, ఉపాసన అనేవి మనస్సుకు ఏకాగ్రతను కలుగజేస్తాయి. ఇవన్నీ అవసరమే. కానీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వ్యక్తిపై వాటికే పరిమితం కాకూడదు. వేదాంతంలోని ముఖ్యమైన ప్రశ్న తాను ఎవరు, తన అసలు స్వరూపమేమిటి అన్నది. నేను అనే విషయంపై మనకున్న భావాల్ని ప్రశ్నించడం, ఆలోచించడం మాత్రమే జ్ఞానానికి సాధనం. ఆలోచన, తత్వచింతన ద్వారానే తత్వాన్ని తెలుసుకో అని తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది.
 
మనం చాలామంది ఈ స్థాయిని గూర్చి అంతగా పట్టించుకోం.
 
మనిషి తత్వాన్ని విశ్లేషించడం గీతలోని ప్రత్యేకత. సృష్టిలోని సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలు వివిధ మనస్తత్వాలున్న వ్యక్తుల్ని ఎలా తయారు చేస్తాయి అనేది చూస్తాం. ఈ వివిధ మనస్తత్వాల వ్యక్తుల్నే ఆయా వర్ణానికి చెందినవాళ్లు అన్నారు. గుణాలు మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తాయి కానీ పుట్టుక కాదు అని గీతపై వ్యాఖ్యానాలు రాసిన ప్రాచీనులందరూ చెప్పారు. పైన చెప్పిన గుణాల్ని అనుసరించే మనం చేసే పనులు, మనం పొందే సంపద ఉంటాయి. సంపద అంటే ధనం, ఐశ్వర్యం అని మన భావన. కానీ గీతలో దైవీసంపత్తు, ఆసురీసంపత్తు అనే విభజన చూస్తాం. అసుర ప్రవర్తన లేదా రాక్షస ప్రవర్తన వల్ల మనం పొందేది ఆసురీసంపత్తు. మంచి ప్రవర్తన, సత్యము, త్యాగము, శాంతి మొదలైన గుణాలే దైవీ సంపత్తు. పొగరు, కోపం, పరుషమైన ప్రవర్తన, అసత్యము, హింస మొదలైనవి ఆసురీసంపత్తు. సాధకుడు ఎలాంటి అలవాట్లు అభ్యాసం చేయాలి. ఎలాంటి వాటిని వదిలేయాలి అని ఇందులో చూడగలం.
 
 
అలాగే ప్రతివ్యక్తికీ తన లక్ష్యంపై కొంత శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ కొందరిలో తీవ్రంగా ఉండవచ్చు. కొందరిలో స్వల్పంగా ఉండవచ్చు. మంచి విషయాలపై ఉండవచ్చు. చెడు విషయాలపై ఉండవచ్చు. కొందరిని మనం గమనించినపుడు వీడికి రాక్షస పట్టుదల ఉంది అని అంటూంటాం. ఇది భగవద్గీత నుండి వచ్చిన మాటే. మన జీవితంలోని ప్రతి పనిలోనూ సాత్వికశ్రద్ధ, తామస శ్రద్ధ ఎలా ఉంటుంది అని విశ్లేషించడం గీతలో ఒక గొప్ప మనస్తత్వ ప్రక్రియ.
 

సాధనమార్గంలో ఉన్నవాడికీ లౌకిక సమస్యల్లో ఉన్నవాడికీ ఇద్దరికీ వర్తించేది భగవద్గీత.

4 COMMENTS

  1. Hi this is Prudhvi raju
    This is my number 7842058420
    Daily I need to get in my whatsup slokas please update

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here