భగవంతునికి – భక్తునికి అనుసంధానం తులసి

0
1351

Tulsi is the connection to God – the devotee of god

సనాతన హిందూ సంప్రదాయంలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైనది తులసి. ఆళ్వార్లు – పూర్వాచార్యులు పరమాత్మ కటాక్షం పొందడానికి తులసికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు.

“తులసి మాలలు ధరించినందు వల్ల నీకు అందం వచ్చిందా? నీవు ధరించినందువల్ల తులసి మాలలకు గౌరవం పెరిగిందా?” అంటూ నమ్మాళ్వారు తన ‘తిరు వాయి మొళి’ దివ్య ప్రబంధంల శతాధికంగా స్వామి యొక్క వైభవాన్ని కొనియాడారు.

మన సంప్రదాయంలో శ్రీమన్నారాయునికి ప్రీతిపాత్ర మైన కల్యాణాలు మూడు.

  1. సీతాకల్యాణం,
  2. రుక్మిణి కల్యాణం,
  3. గోదా కల్యాణం.

నుకనే హిందువులు ఈ కల్యాణాలకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. ఈ కల్యాణాలకు తులసికి అవినాభావ సంబంధం ఉండడం వల్లనే నారాయణునికి తులసి అంత ప్రీతిపాత్రమైనది! మూడు యుగాలతో సంబంధం!

‘భూగర్బ జాతా, భువనైకమాతా’ అని కొనియాడబడిన సీతమ్మ జనక చక్రవర్తికి తులసి వనంతో భూమిని దున్నగా లభించిందని త్రేతాయుగంలో రామకథ ద్వారా మనకు తెలుస్తుంది. 

‘జగన్నాథుడే అనుకొని తనకే సొంతం అని భావించి. తన కొంగుని కట్టుకోజూచి ‘మీరజాలగలడా నా ఆనతి’ అని గర్వించిన సత్యభామ, స్వామి రక్తికి లొంగుతాడని నమ్మింది.

భగవంతుడిని తన వశం చేసుకోవడానికి వీలైన మంత్రం కేవలం భక్తి అనే నమ్మింది రుక్మిణి. అందుకే పరమాత్ముని సంతోషింపచేయాలని చూసింది. మనస్పూర్తిగా ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం’ వీటిలో ఏది స్వామికి అర్పించినా, వారికి పరమాత్మ వశమవుతాడని తెలుసుకొంది. అందుకే తాను నిత్యం అర్చించే తులసీదేవికి నమస్కరించింది. నారద ఉపదేశంతో కృష్ణయ్యనే కొనుక్కోవలసిన పరిస్థితిలో ఉన్న సత్యభామకోసం త్రాసులో భక్తితో తులసి దళం వేసింది. అంతే కృష్ణయ్య బరువుకు తులసి దళం సమానంగా నిలిచింది. ఆహా ఏమి తులసి మహిమ అని విన్నవారు కన్నవారు అచ్చెరువొందారు. అలా తులసి కృష్ణ తులసిగా ద్వాపరం నుంచి కొనియాడబడుతోంది.

ఇక కలియుగంలో స్వామికి ‘పల్లాండు పల్లాండు’ అని మంగళాశాసనం చేసి స్వామి సాక్షాత్కారం పొందిన విష్ణుచిత్తులు పెరియాళ్వారుగా ప్రసిద్ధులు. తులసి వనంలో గొప్పులు తవ్వుతుండగా దొరికింది గోదాదేవి. ఆముక్తమాల్యదగా శ్రీరంగ నాయకిగా కూడా గోదాదేవి పేరుపొందింది. ఈ విధంగా తులసి భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది.

జపతపాదులు నిర్వహించేవారికి తామర, రుద్రాక్ష పూసల కంటే తులసి మాల శ్రేష్టమై నది. ఇది శరీరం మీద ధరిస్తే సత్వగుణంతో పాటు ఆరోగ్యప్రదంగా ఉంటుంది. ప్రాణావ సాన సమయంలో వచ్చినపుడు పరమ పవిత్రమైన ‘తులసి దళం’ వేసిన తీర్థాన్ని నోటిలో పోసి ‘నారాయణ నారాయణ అనడం మన సంప్రదాయంలో చూస్తున్నాం.

ఒక తులసి దళానికే ఇంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలిగినపుడు మండల దీక్షతో 40 రోజులపాటు కోటి తులసి దళాలతో సింహాచలేశునికి అర్చన చేయడం గొప్ప విశేషం.                                                                                                               

 -సిరిపురపు శంకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here