
Wooden Vessels
ఒకానొకప్పుడు ఇటలీ దేశంలో ఒక సుదూర ప్రాంతంలో రాబర్టినో అనే బాలుడు ఉండేవాడు. అతనికి తాత అంటే వల్లమాలిన ఇష్టం, ప్రేమ. ఆ చిన్న బాబు, మరియు ఆ వృద్దుడు ఇద్దరూ మంచి స్నేహితులు. రోజులో ఎక్కువభాగం ఇద్దరూ కలిసే ఉండేవారు.
రాబర్టీనో తాతగారి తొడమీద తలపెట్టి కూర్చుని తాతగారు చెప్పే కథలు ఆసక్తిగా వినేవాడు. తాతగారు చాలా మంచి కథకుడు. ఆయన దేవతల కథలు, వీరుల కథలు, వేట కథలు ఒకసారి తాను వేటకువెళ్లి ఎలా ఒక గద్దను వేటాడిందీ వైనవైనాలుగా చెప్పేవాడు.
మూడు సంవత్సరాల క్రితం నానమ్మ మరణించడంతో తాతగారు-రాబర్జినో తల్లిదండ్రుల వద్ద ఉండడానికి వచ్చేసాడు. రాబర్జినో వాళ్లమ్మ చాలా సమర్ధురాలు.
తన భర్తను, కొడుకును చాలా ప్రేమగా చూసుకునేది. కానీ ఆమె ఆ వృద్ధుని ఒంటరితనాన్ని అర్థం చేసుకోలేదు. కొన్ని కొన్నిసార్లు ఆయనను విసుక్కునేది.
ముఖ్యంగా ఇటీవల ఆయన చేతులు వణకడం, చేత్తో పట్టు కున్నదల్లా పట్టుతప్పడం మొదలైనప్పటినుంచి.
ఒకనాడు రాత్రి భోజనం అయ్యాక తాతగారు కాఫీ తాగడానికి కప్పు చేతిలోకి తీసుకున్నాడు. కానీ పాపం ఆయన ముసలి చేతులు వణికి కాఫీ అంతా తెల్లటి టేబుల్ క్లాత్ మీద ఒలికిపోయింది. ఆ కప్పు చేతిలోంచి జారి నేలమీదపడి ముక్కలు ముక్కలైంది.
రాబర్టినో వాళ్లమ్మ అది చూసి ఆయనను నానా మాటలు అంది. ఆయనేమీ బదులుపలకలేదు కానీ దెబ్బతిన్న బాధ కళ్లల్లో కదలాడుతుండగా ఆమెకేసి నిశ్శబ్దంగా చూశాడు.
రాబర్టీనో కూడా ఏమీ అనలేదు కానీ అతనికి ఇంక భోజనం చేయాలని పించలేదు. “పాపం తాతగారు” అనుకున్నాడు మనసులో.
ఆ రోజునుంచి తాతగారు వంటగదిలోనే ఒక మూల వేసిన చిన్న టేబుల్ మీదనే భోజనం చేయాల్సి వచ్చింది.. ఆ విషయం ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు.
కానీ ఆయన కళ్లల్లో విషాదం తొణికిసలాడింది. తన మనవణ్ని చూసి నవ్విన నవ్వులో కూడా విషాదం వుంది. ఆరోజునుంచి రాబర్జినో తన రాత్రి భోజనం అయ్యీ అవ్వడంతోనే తన ప్రియమైన తాతగారు ఉండే చిన్న వంటగదిలోకి పరిగెత్తుకెళ్లేవాడు. తాతగారు అతన్ని తన ఒడిలో కూర్చోపెట్టుకుని కథ మొదలుపెట్టేవాడు.
దినదినానికి తాతగారు అంతకంతకూ వృద్దుడవుతూ చేతులు వణకడం మరీ ఎక్కువైంది. ఒక పూట ఆయన ఒక్కడే వంటగదిలో భోజనం చేస్తున్నాడు.
చేతులు బాగా వణకడంతో సూప్ గిన్నె కిందపడి ముక్కలు ముక్కలైంది. నేలమీదంతా సూప్ పడింది. రాబర్టీనో, తల్లీ, తండ్రి వంటగదిలోకి పరుగున వచ్చారు. శుభ్రంగా కడిగిన నేలమీద సూప్ చిందర వందరగా పడివుంది. గిన్నె ముక్కలు అక్కడక్కడా పడీవున్నాయి.
అది చూసి రాబర్టీనో వాళ్లమ్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ తాతగారు భయంతో, దిగ్ర్భాంతితో మాన్పడిపోయాడు. వాళ్లమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.
ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? రోజుకొకటి పగలకొడుతుంటే ఎన్నని కొనాలి? ఇంక లాభంలేదు. ఇప్పటినుంచి చెక్కపాత్రలో పెట్టాలి’ అని గొణుగుతూ గది అంతా శుభ్రం చేసింది.
ఆకస్మికంగా రాబర్టినో తన తల్లి ఒక మూలకు ఊడ్చిన పగిలిన గిన్నె ముక్కల దగ్గరికి వెళ్లాడు. వాటిని జాగ్రత్తగా ఏరి మళ్లీ గిన్నె ఆకారంలో అమర్చాడు.
అతడెంత జాగ్రత్తగా పేర్చాడంటే అవి పగిలిన ముక్కలు అని తెలియనంతగా. అప్పుడొక చెక్కముక్క తెచ్చి తాను అమర్చిన గిన్నెవైపే దీక్షగా చూస్తూ సరిగ్గా అలాగే చెక్కసాగాడు. కొద్దిసేపయ్యాక రాబర్టీనో ఏం చేస్తున్నాడో చూద్దామని అతని తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు.
“ఏం చేస్తున్నావు నాన్నా?” అంటూ ఆమె ఆప్యాయంగా అడిగింది. ఆమె రాబర్టినోతో ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడుతుంది.
“నువ్వు ముసలిదానివయ్యాక తినడానికి నీకోసం చెక్కపాత్ర తయారుచేస్తున్నా’ అన్నాడు రాబర్టీనో.
రాబర్టీనో తల్లిదండ్రులు ఒకరి ఈ ముఖం ఒకరుచూసుకున్నారు. రాబర్జినో కళ్లల్లోకి చూడడానికి వాళ్లకుముఖం చెల్లలేదు.
అప్పుడామె వెళ్లి తాతగారి చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ భోజనాల గదిలోకి తీసుకెళ్లింది. ఆమె అక్కడ టేబుల్ మీద ఆయనకు భోజనం వడ్డించి తినడానికి సహాయం చేసింది.
ఆ తర్వాత తాతగారు వంటరిగా వంటగదిలో ఎన్నడూ తినలేదు. రాబర్టీనో సంతోషానికి అంతులేదు. ఇప్పుడు తాతగారిని అమ్మా నాన్నా ఆప్యాయంగా చూస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తున్న రాబర్టీనోకు వాళ్లు ఒక నూతన ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు అర్థమైంది. ఎందుకంటే ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ చెరిగిపోని ఆనందాన్నిస్తాయి కదా.
(ఆంగ్ల మూలం: డొమెనికో విట్టోరిని)
-మేకల మదన్మోహన్ రావు