ది.18/11/2020 బుధవారం – నాగులచవితి
Nagula Chavithi
మన దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు నాగజాతివాడు, సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనంగా అమరినవాడు, శివుడు నాగాభరణుడు, ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం, మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధపంచమినాడు నాగపంచమి, కార్తీకశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.
ఆశ్లేషనక్షత్రానికి అధిష్టానదేవత సర్పం, నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం.
విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది.
వృశ్చికరాశిలో జ్యేష్టానక్షత్రం సర్పనక్షత్రం, ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగులచవితి. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి.
ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వార ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు, కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
its really awesome explanation which i don’t know about it..
thanks and regards
V.Praveen kumar