తమిళనాడు లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువళూర్ లో కొలువై ఉన్న కనకవల్లీ సమేత వీరరాఘవస్వామిని దర్శించి తీరవలసిందే. ఆయన శోభను తిలకించడానికి జనం తండోప తండాలుగా వస్తారు. వివాహాది శుభకార్యాలను ఇక్కడే నెరవేరుస్తారు. స్వామి కృపతో ఎంతో మంది అత్యంత ప్రమాద కరమైన రోగాల బారినుండీ విముక్తులయ్యారు.
ఆలయం దాదాపు 5000 సంవత్సరాల పూర్వం నిర్మింపబడిందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. 9 వ శతాబ్దం లో పల్లవుల కాలం లో ఆలయ సింహ ద్వార్మ నిర్మింప బడింది. ఈ ఆలయం ప్రస్తుతం అహోబిల మఠం వారి ఆధ్వర్యం లో ఉంది. ఆళ్వారుల 108 దివ్యదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి.
ఆలయం లో వీర రాఘవ స్వామి తో పాటుగా కనకవల్లీ అమ్మవారు, వినాయకుడు,గోపాలుడు, నమ్మాళ్వారు మొదలన వారు కొలువై ఉన్నారు. వీర రాఘవ స్వామి ఇక్కడి రాజైన ధర్మసేనుని కుమార్తె వసుమతిని వివాహమాడాడని ప్రతీతి ఆమెకే కనక వల్లి అని పేరు.
విశేషాలు :
ఏదైనా వ్యాధి నయం కావడానికి వచ్చినవారు. ఆ వ్యాధి వచ్చిన అంగం రూపం చిత్రించిన ఒక లోహపు ఫలకాన్ని తృతీయ రోజు కానీ అమావాస్య రోజూకానీ ముడుపుకట్టి స్వామిని వేడుకుంటారు. ఆయనను వైద్య వీర రాఘవుడని కూడా అంటారు. స్వామివారి విమానాన్ని విజయాకోటి విమానం అంటారు. మధుకైటభులనే రాక్షసులని సంహరించి విజయాన్ని పొందిన సందర్భంగా విమానానికి ఆ పేరు వచ్చింది. హృతతాప నాశిని అని పిలువబడే అక్కడి కోనేరు గంగానది కన్నా పవిత్రమని భావిస్తారు.
శాలిహోతిరుడనే ముని తపస్సుకి మెచ్చి స్వామి ఇక్కడ కొలువుతీరాడని స్థలపురాణం చెబుతుంది.