శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam

0
939

భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను.

పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో యథాశక్తి సమర్పించవచ్చును.

మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను.

పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను. ప్రతి శ్లోకమును చదివి శ్లోకము దిగువ యిచ్చినట్లు ఉపచారములు చేయవలెను.

ఏకవిశంతి పత్రములు –

వివిధ ఓషధులను గుర్తించుటకు భాద్రపదమాసము అనువైన కాలము. ఇరవై ఒక్క రకముల పత్రిని సేకరించుట అనగా ఇరవైఒక్క రకముల వనౌషధులతో పరిచితి ఏర్పరుచుకొనుటయే. ఓషధీ పరిజ్ఞానముకూడ అవసరమైన విద్యయే. సేకరించుట దేవపూజకు కాబట్టి శ్రద్ధతో జరుగును.

౧. సూచీ – అనగా కుశమ్, కుశదర్భ, బర్హి, సూచ్యగ్ర మున్నగునవి దీని పర్యాయ పదములు, శుభాశుభ కర్మలలో దీనిని హెచ్చుగా వాడెదరు.
౨. బృహతీ – నేలములక, పెద్దములక, వాకుడు మున్నగునవి యిందులో భేదములు.
౩. బిల్వ – మారేడు, శివునకు ప్రియమైనది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో సాటిలేనిది.
౪. దూర్వా – అనగా గరిక.
౫. దుత్తూర – ఉమ్మెత్త, విషాన్ని హరించడంలో పెట్టింది పేరు.
౬. బదరీ – రేగు.
౭. అపామార్గ – ఉత్తరేణి.
౮. తులసి – శివకేశవులకిద్దరకు ప్రీతికరమైనది.
౯. చూతపత్రం – మామిడి ఆకు.
౧౦. కరవీర – గన్నేరు, వాడగన్నేరు.
౧౧. విష్ణుక్రాంత – నీలవర్ణపు చిన్న చిన్న పూలు పూయును.
౧౨. దాడిమీ – దానిమ్మ
౧౩. దేవదారు – ఆకులు, చిన్నవిగా, గుండ్రంగా, సువాసన కలిగి ఉంటాయి.
౧౪. మరువక – మరువము, చక్కనివాసన గల పత్రములు కలది
౧౫. సింధువార – వావిలి.
౧౬. జాజిపత్ర – జాజిపత్రి, జాపత్రి ఒక చెట్టువే. జాజిపత్రి ఆకు, జాపత్రి కాయ మీదితొడుగు. పాఠభేదంతో మాలతీలతకు అర్థం చెప్పుకోవాలని కొందరు అంటున్నారు.
౧౭. గండవీ – తెల్లగరికె.
౧౮. శమీ – జమ్మి
౧౯. అశ్వత్థ – రావి.
౨౦. అర్జున – మద్ది.
౨౧. ఆర్కపత్రం – జిల్లేడు.
ఇట్లు ఇరవై ఒక్క పత్రములతో పూజ చేయవలెను. పూజకోసం సేకరిస్తూ పై ఓషధులతో పరిచితి చిన్ననాటనే ఏర్పరచుకోవడం బ్రతుకుతెరువు నేర్చుకొనడమే.

Download PDF here Sri Vinayaka Vrata Kalpam (Part 1) – శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (1)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here