
ఔదుంబరవృక్ష పూజ | Udumbara Tree Puja in Telugu
ఔదుంబర వృక్షం / మేడి చెట్టు / అత్తి చెట్టు / బొడ్డ చెట్టు / క్షీర వృక్షం / హేమదుగ్ధ వృక్షం / దత్త వృక్షం.
శ్రావణశుద్ధ విదియనాడు ఔదుంబర వృక్షమునందు శివుని, శుక్రుని ఉద్దేశించి పూజించాలి. అది అందుబాటులో లేకపోతే గోడపైన ఔదుంబరవృక్ష చిత్రమును లిఖించి పూజించి ఈ విధంగా ప్రార్ధించాలి.
“ఉదుంబర నమస్తుభ్యం నమస్తే హేమపుష్పక సజంతుఫలయుక్తాయ నమో రక్తాండశాలినే”.
1. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం
గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు సర్వదా ఉంటారని పైంగ్య బ్రాహ్మణము నందు వివరించబడినది. దత్త భక్తులు ఔదుంబర వృక్షం క్రింద ఉన్నయెడల వారు శ్రీదత్త ప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లే . శ్రీపాదుల వారి ప్రకారం ఔదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడును . అపమృత్యు భయములను పారద్రోలును. శ్రీపాదులవారికి, భక్తులకు మధ్య వారధిగా ఔదుంబర వృక్షం ఉంటుంది. భక్తులు తమకష్టాలను, కోరికలను ఔదుంబర వృక్షంనకు నివేదించిన యెడల అవన్నీనేరుగా శ్రీ పాదుల వారికి చేరుతాయి . దత్త భక్తులకు ఔదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైనది. ఔదుంబర వృక్షం గృహమునందు ఉన్న సాక్షాత్తు దత్తత్రేయలవారు మనయింట్లో ఉన్నట్టే.